దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా పెట్రోల్ ధరలు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. దీనితో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. 80 రూపాయలకు పైగా పెట్రోల్ ధరలు ఉన్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై 4.5 శాతం వ్యాట్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన జగన్, ఈ నిర్ణయంతో అందరిని షాక్ కి గురి చేసారు. పెట్రోల్‌పై ప్రస్తుతం 31 శాతంగా ఉన్న వ్యాట్ పెంపుతో 32.20శాతానికి పెరిగింది. 22.25 శాతంగా ఉన్న డీజిల్ వ్యాట్ తాజాగా 27 శాతానికి పెరిగింది.
వ్యాట్ పెంపు ఫలితంగా పెట్రోల్, డీజిల్‌పై అదనంగా రూ.2 పెరగనుంది. అయితే ఇక్కడ మరో నిర్ణయం తీసుకుంది. వ్యాట్‌పై అదనంగా వసూలు చేస్తున్న సెస్ రూ.2ను వసూలు చేయొద్దని తన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. వ్యాట్‌తో పాటు అదనంగా వసూలు చేస్తున్న రూ.2ను పన్నులోనే కలిపేస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వ్యాట్ చట్టంలో షెడ్యూల్-6ను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.