సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారనుందా

-

ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిపే విషయంలో జగన్ ప్రభుత్వం కొత్త విధానానికి తెర తీసింది. కాంట్రాక్టుర్లకు జరిపే చెల్లింపులు నేరుగా బ్యాంకుల ద్వారానే జరిగేలా వెసులుబాటు కల్పించింది. ఇంతకీ ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది.. బ్యాంకర్లు పెట్టిన షరతులా..లేక ప్రభుత్వమే కొత్త తరహా ఆలోచన చేసిందా ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో..ఆర్థిక శాఖ వర్గాల్లో దీని పైనే చర్చ నడుస్తుంది.


ఏపీలో జగన్ సర్కార్ కొలువు తీరాక పూర్తిగా సంక్షేమ కార్యక్రమాల అమలు మీదే పూర్తి స్థాయి ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో రోడ్ల నిర్మాణం విషయంలో చాలా అశ్రద్ధ చేశారనే విమర్శలు ఎదుర్కొంది ప్రభుత్వం. ఈతరుణంలో దీనికి సంబంధించి నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా పెట్రో సెస్ వేసింది ప్రభుత్వం. దాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషనుకు మళ్లించడం ద్వారా రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రణాళికలు సిద్దం చేసింది. నిధుల సమీకరణ కోసం రెండు వేల కోట్ల రూపాయలను వివిధ బ్యాంకుల ద్వారా రుణం రూపంలో తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు అధికారులు కూడా బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపారు.

ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఓ జీవో సచివాలయంలో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. రోడ్ల నిర్మాణం జరిపే కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ద్వారా కాకుండా.. నేరుగా బ్యాంకులే చెల్లింపులు జరిపేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సదురు కాంట్రాక్టర్ చేసే పనికి సంబంధించి ఎప్పటికప్పుడు బిల్లులను సీఎంఎఫ్ఎస్ కు రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ పంపాలి. కాంట్రాక్టర్ల పేర్లతో కూడిన జాబితా బిల్లులకు సంబంధించిన నిధుల వివరాలు అందుకున్న సీఎంఎఫ్ఎస్.. వాటిని సదురు బ్యాంకులకు పంపితే ఆ బ్యాంకులు ముందుగా రోడ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీ ఖాతాకు జమ చేస్తుంది. అక్కడి నుంచి వెంటనే కాంట్రాక్టర్ల ఖాతాలకు మళ్లించడం ద్వారా చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేస్తాయి బ్యాంకులు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణం కోసం ముందడుగు వేసినా రోడ్ల నిర్మాణ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల కూడా ఈ తరహా కొత్త విధానం అమల్లోకి వచ్చి ఉండొచ్చనేది మరో చర్చ. ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టడం వెనుక ప్రత్యేక కారణాలేవీ లేవని ప్రభుత్వం చెబుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కాంట్రాక్టర్ల ఫేటు మారుస్తుందా లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news