తెలంగాణ ఇచ్చామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ కు సిగ్గుండాలి.. మర్యాదగా మనకు తెలంగాణ ఇవ్వలే.. గోసపెట్టి తెలంగాణ ఇచ్చిన్రు.. ఎంతోమంది విద్యార్థుల త్యాగ ఫలితం.. మా పోరాటానికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన్రు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉండేవి.. ఇవాళ తెలంగాణలో నీలి విప్లవాన్ని తీసుకోచ్చాం.. ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. యూపీ, బీహార్, కర్ణాటక నుంచి వరినాట్లు వేసేందుకు తెలంగాణకు కూలీలు వస్తున్నారని చెప్పారు.
తుంగతుర్తి సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. దళితులను ఇంకా దరిద్రం వెంటాడుతోంది. ఈ పరిస్థితి కారణం గత పాలకులే అన్నారు సీఎం కేసీఆర్. దళితుల గురించి ఏ ప్రభుత్వం ఏనాడైనా పట్టించుకోలేదన్నారు. దళితబంధుతో బీఆర్ ఎస్ ప్రభుత్వం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. తుంగతుర్తి ప్రాంతాన్ని ఏ నాయకుడు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ వచ్చాక.. తుంగతుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ప్రచారంలో భాగంగా ఈరోజు కోదాడ, తుంగతుర్తి సభల్లో పాల్గొన్న కేసీఆర్.. రెండు సభల్లోనూ డీకే శివకుమార్‌పై పంచులు పేల్చారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ 24 గంటల కరెంటు అవసరం లేదని కాంగ్రెస్ నేతలు వద్దంటున్నారని.. కేవలం 3 గంటల కరెంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడే చెప్తున్నాడని పేర్కొన్నారు. అయితే.. కర్ణాటక నుంచి అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రచారానికి వచ్చాడని.. పరిగిలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో రైతులు 5 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నాడని తెలిపారు. అక్కడ 5 గంటల కరెంట్ ఇస్తే.. ఇక్కడ 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ కౌంటర్ ఇచ్చారు కేసీఆర్. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంటు ఇస్తున్నామంటూ గొప్పలు పోవటమేంటీ అంటూ తనదైన శైలిలో చెప్పటంతో.. సభ మొత్తం ఒక్కసారిగా గొల్లున నవ్వింది.