హైదరాబాద్: ఈటల రాజేందర్ రాజీనామా, విమర్శలు, ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. దీంతో సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారట. హుజురాబాద్‌పై ఫోకస్ పెట్టారట. పార్టీలో షాక్ ఇచ్చినట్లే కరీంనగర్ జిల్లాలో కూడా ఈటలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే వ్యూహాలు రచించారట. కరీంనగర్ జిల్లా నేతలతో విమర్శలు చేయిస్తూ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటలను దూరం చేయాలని స్కెచ్ వేస్తున్నారట.
స్వయంగా సీఎం కేసీఆరే వెళ్లి కరీంనగర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేస్తారట. ఇందుకోసం వ్యూహాలు రెడీ చేశారట. హుజూరాబాద్‌లో కింది స్థాయి కార్యకర్తలతో పాటు టీఆర్ఎస్ నాయకులు జారిపోకుండా కేసీఆర్ పక్కాగా పావులు కదుపుతున్నారట. ఉపఎన్నిక జరిగితే పార్టీ పట్టు సడలకుండా ఉండేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ కరీంనగర్‌కు వెళ్తున్నారట. ఈ పర్యటనలో హుజూరాబాద్‌ను పూర్తిగా టీఆర్ఎస్ దిగ్బంధనం చేసేలా ఈటలకు ఎక్కడా ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే సూచనలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
కాగా సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మొత్తం మీద కేసీఆర్ కరీంనగర్ పర్యటన తర్వాత హుజురాబాద్ రాజకీయం మరింత రక్తి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.