చదువుల తల్లీ సరస్వతీ క్షేత్రం బాసర !

-

చదువు… చదవు.. సర్వజగత్తును గెలవడానికి ఉపయోగపడేది చదవు అంటే అక్షరం. ఆ ఆక్షరం ఉంటే చాలు ఈ ప్రపంచంలో అన్నింటిని సాధించుకోవచ్చు. అలాంటి అక్షరానికి అధిదేవత సరస్వతిమాత. ఆ మాత కొలువుదీరిన క్షేత్రాలు చాలా తక్కువ. అందులోనూ పురాతన కాలం నాటివి అయితే వేళ్లమీద లెక్కపెట్టుకోవచ్చు. అలాంటి పురాతన యుగయుగాలనాటి క్షేత్రం వ్యాస ప్రతిష్టితమైన తల్లి బాసర క్షేత్రం. వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టిన రోజు శ్రీపంచమి రోజు మాఘశుద్ధ పంచమి. ఈ నెల 30న సందర్భంగా ఈ ప్రత్యేక విశేషాలు తెలుసుకుందాం…. సరస్వతిదేవి కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. శృంగేరి, కశ్మీర్, కుతనూర్ (తమిళనాడు) వంటి అతి కొద్ది ప్రదేశాలలో మాత్రమే ఆ దేవిని కొలుచుకునే భాగ్యం లభిస్తుంది. అలాంటి అరుదైన భాగ్యం మన తెలుగువారికీ ఉంది. అదే బాసర.
శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి
వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే !!
బాసర క్షేత్రం ఈనాటిది కాదు. బ్రహ్మాండ పురాణంలో సైతం ఈ స్థల మహత్యం గురించి ఉంది. అందులో ప్రముఖంగా వినిపించే కథ మాత్రం వ్యాసునికి సంబంధించినది. కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించిపోయిన వ్యాసులవారు ప్రశాంతంగా తపస్సుని ఆచరించేందుకు గోదావరీ తీరంలోని మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట. ఇక్కడి గోదావరిలో స్నానమాచరిస్తుండగా వ్యాసులవారికి సరస్వతి సాక్షాత్కరించిందని చెబుతారు. భూలోకం మీద తన నివాసస్థానం బాసరే అనీ, సైకతంతో తన విగ్రహాన్ని రూపొందించమనీ ఆమె వ్యాసులవారికి వెల్లడించారట.

ముగురమ్మల నిలయం బాసర

అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజూ పిడికెడు మట్టిని తీసుకుని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించారు. అదే ఈనాడు కనిపించే మూలవిరాట్టని చెబుతారు. ఆ మూలవిరాట్టుకి పసుపు పూస్తూ ఆమెకు సరికొత్త రూపుని అందిస్తుంటారు. అమ్మవారి విగ్రహానికి సమీపంలోనే మహాలక్ష్మి, మహాకాళి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఇలా ముగ్గురమ్మలూ ఓ చోట కొలువై ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతిలో రూపొందింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు ఉండేది. దాని నామాంతరమే బాసర.

బాసరలో కేవలం అమ్మవారి ఆలయమే కాదు, భక్తుల మనసుని సేదతీర్చేందుకు చాలా ఆధ్మాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. దత్త మందిరం, వ్యాసమందిరం, వ్యాసులవారి గుహలను భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. ఇక గోదావరి నదిలో స్నానమాచరించిన తరువాత అక్కడే ఉన్న ప్రాచీన మహేశ్వర ఆలయం కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయం సమీపంలోనే ఉన్న వేదవతి శిల మరో విశేషం. ఈ శిలను తడితే వేర్వేరు చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయి. లోపల సీతమ్మవారి నగలు ఉండటం వల్ల ఇలాంటి శబ్దాలు వస్తాయని ఓ కథనం. సీతమ్మవారిని వేదవతి అని కూడా పిలుస్తారు కాబట్టి ఈ శిలకు వేదవతి శిల అన్న పేరు వచ్చింది. బాసరలోని జ్ఞాన సరస్వతి దీవెనలను అందుకునేందుకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం కనుక చేస్తే, వారి విద్యకు ఢోకా ఉండదని నమ్మకం. ఇక దసరా నవరాత్రులు, గురుపౌర్ణమి వంటి సందర్భాలలో సందర్శకులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తయితే దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చే మూలానక్షత్రం రోజున, వసంత పంచమి రోజున బాసరను తల్చుకోని తెలుగువాడు ఉండదు. అమ్మవారి జన్మ నక్షత్రం మూల. ఇక మాఘమాసంలోని పంచమి తిథి ఆమె జన్మదినం. అందుకే ఈ రెండు రోజులకూ విశేష ప్రాధాన్యం ఉంటుంది.

సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కానీ సరస్వతీ దేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు. జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం. అందుకే పుస్తకం, వీణలను చేతపట్టి ధవళ వస్త్రాలతో కనిపిస్తారు. తత్వ విచారానికీ, పరిపూర్ణ వ్యక్తిత్వానికీ చిహ్నమైన కమలం మీద ఆశీనులై ఉంటారు. అందుకే జ్ఞానాన్ని ఆశించే ప్రతి హిందువూ ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి ’ అంటూ ఆ తల్లిని పూజిస్తారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news