తెలంగాణలో తెరాస తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలకు ప్రాజెక్టులను నిర్ణీత వ్యవధి కంటే ముందే పూర్తి చేసి వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు గాను జనవరి ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పర్యట నలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథక పనులను పరీశీలిస్తారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించినా, వాతావరణం అనుకూలించక పర్యటన వాయిదా పడిన విషయ తెలిసిందే.
జనవరి 1న హైదరాబాద్‌లో జరిగే హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలుదేరతారు.
జనవరి 2న ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వరరావుపేట, రాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న పంపుహౌస్ పనులను పరిశీలించి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటనకు ముందే ఈ నెల 31న రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల పురోగతిపై నివేదిక రూపొందిస్తారు. జనవరి 1న రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి అక్కడ పనులను పర్యవేక్షిస్తుంది. జనవరి 2న సీతారామ ప్రాజెక్టు పనులను సందర్శించి హైదరాబాద్ చేరుకుంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి సమీక్ష సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పనులను వేగవంతం చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇంజనీర్లు ఇక్కడి కాంక్రీట్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. సాగు, తాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి కోటి ఎగరాలకు నీరందించాలనే తన లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకునే విధంగా సీఎం కేసీఆర్ ప్రణాళికను రూపొందించారు.