జాతీయ పార్టీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విజయదశమి రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేసే అవకశామున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే పార్టీ శ్రేణులంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని ముక్తకంఠంతో ఓకే చెప్పారు. ఈ క్రమంలో దసరా రోజున తెరాస కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.
ఇప్పటికే దానికి భారత్ రాష్ట్ర సమితి తదితర పేర్లు పరిశీలనలో ఉండగా.. కొత్తగా ‘మేరా భారత్ మహాన్’, ఇతర పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. దసరా నాడు జాతీయ పార్టీపై తీర్మానం అనంతరం దాన్ని దిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించి, ఆమోదం కోరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ గుర్తు అయిన కారును కొనసాగించాలని విన్నవించనున్నారు. జాతీయ పార్టీ జెండా కూడా ప్రాథమికంగా ఖరారైనట్లు తెలుస్తోంది. భారతదేశ చిత్ర పటంతో పాటు గులాబీ రంగు సైతం ఆ జెండాలో మిళితమై ఉంటుందని సమాచారం.
జాతీయ పార్టీ ఆమోదం పొందిన తర్వాత భారీ బహిరంగ సభను రాష్ట్రంలో గానీ, దిల్లీలో గానీ నిర్వహించి, ఎజెండాను కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ సన్నాహాలపై ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.