జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరోవైపు దసరా రోజు తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హాజరై జాతీయ పార్టీ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు సమాచారం.
పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న కేసీఆర్ ఇప్పటికే దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చారు. ఇక జాప్యం చేయరాదనే ఉద్దేశంతో గత కొన్ని రోజులుగా విధివిధానాలపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస రాష్ట్ర నేతల ఏకాభిప్రాయంతో దసరా రోజు మధ్యాహ్నం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తెరాసనే జాతీయ పార్టీగా మార్చనున్నారని సమాచారం. ఇప్పటికే దానికి భారత్ రాష్ట్ర సమితి తదితర పేర్లు పరిశీలనలో ఉండగా.. కొత్తగా ‘మేరా భారత్ మహాన్’, ఇతర పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.