సీఎం కేసీఆర్ ఇవాళ కీలక సమీక్ష

హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతిపై మరోసారి సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. పల్లె, పట్టణాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బృహత్తర కార్యక్రమం చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు ఎప్పటికప్పుడు నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలు తీరుపై పూర్తి స్థాయిలో సమగ్రంగా తెలుసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన జూన్ 19న జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళ్లనున్నారు.

ఇక పల్లె, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు, అమలు తీరుపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో​ ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ఆయన సమావేశంకానున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, అనుభవాలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. ఆకస్మిక తనిఖీలకు వెళుతుండటంతో అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తనిఖీ కోసం ఛార్ట్ తయారు చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఇప్పటికే ఆదేశించారు. గ్రామాలు, మండలాల వారీగా చార్ట్‌ల రూపకల్పన, విధివిధానాలపై కూడా సమీక్షలో కేసీఆర్ స్పష్టం చేయనున్నారు.