ఓటర్లు ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడితేనే మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం కేసీఆర్ హితవు పలికారు. ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. ‘మంత్రి పువ్వాడ కృషితోనే ఖమ్మం చాలా అభివృద్ధి చెందింది. పువ్వాడను గెలిపిస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వాడ పువ్వులు కావాలా? తుమ్మల తుప్పలు కావాలా? తుమ్మలను గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి. ఓడిన తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చా’ అని వెల్లడించారు. ఖమ్మం జిల్లా చాలా చైతన్యమైన ప్రాంతమని సీఎం కేసీఆర్ అన్నారు.
మన దేశంలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదన్నారు. ప్రజాస్వామ్య పరిణితి రావాలంటే యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో పార్టీలు పోటీ చేయడం.. గెలుపోటములు అనేవి సహజమని పేర్కొన్నారు. అభ్యర్థుల గుణగణాలు పరిశీలించిన తర్వాతనే ఓటేయాలని కోరారు.ఓటు వేసేటప్పుడు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ఓటర్లు పరిణితితో ఓటేస్తేనే.. ప్రజాస్వామ్యం గెలుస్తుందని వివరించారు. ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. 70 ఏళ్ల క్రితం ఖమ్మం కవి రావెళ్ల వెంకట్రామారావు తెలంగాణపై పాట రాశారని గుర్తు చేశారు. నా తల్లి తెలంగాణ రా.. నందనోద్యానమ్మురా అని ఖమ్మం ప్రజల్లో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికారని కేసీఆర్ గుర్తు చేశారు.