టీఎస్పీఎస్సీ బోర్డు పై సీఎం కేసీఆర్ ఆలోచన వేరే ఉందా

-

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది పబ్లిక్ సర్వీస్ కమిషనే. ఉద్యోగ నియామకం ఏదైనా టీఎస్పీఎస్సీ ద్వారానే అని గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగడానికి అదే కరెక్ట్‌ అని తేల్చారు కూడా. ఉద్యోగాల భర్తీ బాధ్యతలు కూడా సర్వీస్ కమిషన్‌కి ఆయా ప్రభుత్వ శాఖలు అప్పగించాయి. అలాంటి కీలక కమీషన్ పై సీఎం కేసీఆర్ ఆలోచన మరో విధంగా ఉందా అన్న చర్చ ఇప్పుడు ప్రభుత్వవర్గాల్లో నడుస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలినాళ్లలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ బోర్డుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. కీలక పోస్టులన్ని కూడా టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీ చేసేలా ప్రణాళిక సిద్దం చేసింది. అప్పటి వరకు డిపార్ట్‌మెంట్‌ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నియామక బాధ్యతలను కూడా ఆయా శాఖలు టీఎస్పీఎస్సీ బోర్డుకు కి అప్పగించాయి. గురుకుల సొసైటీలలో ఉపాధ్యాయులు.. వైద్యశాఖలోని ఉద్యోగాల భర్తీ బాధ్యతలు కూడా కమిషన్‌కే ఇచ్చారు.

ఏమైందో ఏమో కానీ చిన్నచిన్న కారణాలతో బోర్డు సభ్యుల నియామక ప్రక్రియ ఆలస్యం కావడంతో ప్రభుత్వ పెద్దలు అసంతృప్తికి లోనయ్యారట. అప్పటి నుంచి ఆ సంస్థకు ప్రాధాన్యం తగ్గిస్తూ వచ్చినట్టు చెబుతున్నారు. పోస్టుల భర్తీని అప్పగించడం లేదు. గురుకులాల్లో రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లోనూ ఈ బోర్డు ద్వారానే నియామకాలు జరుగుతాయట. వైద్యశాఖకు సంబంధించి కమిషన్‌కు ఇచ్చిన పోస్టుల భర్తీని వెనక్కి తీసుకున్నారట. ఇక్కడ కూడా నియామకాలను వైద్యశాఖే చెపడుతుందని సమాచారం. ఇప్పుడు ఉపాధ్యాయుల భర్తీని టీఎస్పీఎస్సీకి అప్పగించే ఆలోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది.

ప్రభుత్వం భర్తీ చేస్తామని చెప్పిన 50 వేల ఉద్యోగాల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేసేవి పెద్దగా ఉండక పోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్రూప్ 1 ,గ్రూప్ 2 లాంటి పోస్ట్‌లకే కమిషన్‌ను పరిమితం చేస్తారని అనుకుంటున్నారు. ఈ కారణంగానే టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకంపై కేసీఆర్ సర్కార్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని భావిస్తున్నారు. ఛైర్మన్‌ పదవీకాలం పూర్తయ్యి మూడున్నర నెలలు అవుతున్నా అందుకే భర్తీ చేయలేదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news