తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలోని పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటి కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సహకాలు అందించే గ్రిడ్ పాలసిని ఆమోదించింది. అదేవిధంగా సెక్రటేరియట్ కొత్త భవన నిర్మాణంతో పాటు డిజైన్లను కేబినెట్ ఆమోదించింది.
ఇకపోతే తెలంగాణలో పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రానిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ క్రమంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని కేబినెట్ ఇవాళ ఆమోదించింది.