నల్గొండ: సీఎం కేసీఆర్ ఇవాళ హాలియా వెళ్లనున్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక సమయంలో ఆయన ఇచ్చిన హామీలు, సమస్యలపై స్థానిక నేతలతో కలిసి సమీక్షించనున్నారు. మరోవైపు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రగతిపై కూడా చర్చించనున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్‌తో కలిసి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకల్లా ఆయన హాలియా చేరుకుంటారు. ఇందుకోసం కేసీఆర్ కాసేపట్లో హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన హాలియాకు బయల్దేరనున్నారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా అటు పోలీసులు భద్రతను కట్టదిట్టం చేశారు.

మరోవైపు పాలనలో కేసీఆర్ దూకుడు పెంచారు. సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టారు. అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 57 దాటిన పెన్షనర్ల స్కీమ్‌ను తక్షణమే అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.