ఏడుగురు విక్రమ్‌లు… ఒకేసారి

-

ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌ ఇరవై పాత్రలలో కనిపించనున్నాడని చెన్నై వర్గాల సమాచారం.

విక్రమ్‌… తమిళ, తెలుగు చిత్ర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పాత్రలకు ప్రాణం పోయడం కోసం ఎటువంటి రిస్క్‌నయినా తీసుకునే అతికొద్ది మంది భారత కథానాయకులలో ఆయననొకరు. సేతు (తెలుగులో ‘శేషు’), పితామగన్‌ (తెలుగులో ‘శివపుత్రుడు’), అన్నియన్‌ (అపరిచితుడు) లాంటి బ్లాక్‌బస్టర్‌ సినిమాలలో విక్రమ్‌ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి.


వరుస ఫ్లాపులతో ప్రస్తుతం వెనకాలే ఉన్నా, వెనకడుగు మాత్రం వేయని ధీరుడు విక్రమ్‌. ఇప్పుడు మరో అవతారంలో ( సారీ.. అవతారాలలో..) మనకు దర్శనివ్వబోతున్నాడు. తన తాజా చిత్రం ‘కోబ్రా’ ఫస్ట్‌ లుక్‌ను నిన్న ట్విటర్‌ ద్వారా విడుదల చేసిన నిర్మాణ సంస్థ, నమ్మశక్యకాని రీతిలో, ఏడు పాత్రల విక్రమ్‌ అవతారాలను ప్రదర్శించింది. నభూతో.. అన్న చందాన ఒకదానికొకటి అసలేమాత్రం పోలికలేకుండా, కొన్నింటిని అసలు గుర్తుపట్టే పరిస్థితే లేకుండా ఉన్న ఏడు పాత్రలతో నివ్వెరపరిచాడు చియాన్ విక్రమ్. ఈ సినిమాలో మొత్తం 20 పాత్రలలో విక్రమ్‌ కనిపించనున్నాడని తెలుస్తోంది. ప్రధానంగా విక్రమ్‌ ఫోటోగ్రాఫర్‌గా కనిపిస్తాడని చెబుతున్నారు.

‘డిమాంటీ కాలనీ’ దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో రాబోతున్న ఈ ‘కోబ్రా’కు ఏఆర్‌ రహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ చిత్రంతో రంగ ప్రవేశం చేయనున్నాడు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. గత నవంబరు నుండి షూటింగ్‌లో ఉన్న ‘కోబ్రా’, ప్రస్తుతం కోల్‌కతాలో చిత్రీకరణలో ఉంది. క్లయిమాక్స్‌ మాత్రం భారీ ఎత్తున రష్యాలో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. మే 2020లో విడుదల కానుంది.

సెవెన్‌ స్క్రీన్‌ స్టుడియో బ్యానర్‌పై లలిత్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇంకా తీజయ్‌, ఆనంద్‌రాజ్‌, కేఎస్‌ రవికుమార్‌, బాబు ఆంటొనీ, పద్మప్రియ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ చూసిన చియాన్‌ అభిమానులు మాత్రం తమ ఆతృతను, ఆనందాన్ని ఆపుకోలేక సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news