హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఈ రోజు నుంచి ఉచితంగా తాగునీటిని సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటిని అందించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ పథకాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో ప్రారంభించనున్నారు.
ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం అమలు చేయాలంటే తెలంగాణ ప్రభుత్వానికి అతి పెద్ద భారమేనని చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తంలో నీటి వాడకం ఎక్కువగా జరిగేది హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే.. సుమారు 10 లక్షల వరకు తాగునీటి నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని నల్లాలకు ఉచితంగా నీటి కనెక్షన్ ఇవ్వాలనుకోవడం కష్టమైన పనే అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నెల నుంచి నెలవారీ బిల్లులు ఉండవనీ, గ్రేటర్ పరిధిలో ఉన్న90 శాతం నల్లా కనెక్షన్లకు ఉచితంగా నీటి సరఫరా అందించనుంది. రోజుకి 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ జలమండలి విభాగం ఐదేళ్ల నుంచి ప్రతి నెలా రూ.40 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. అయినా గ్రేటర్ ప్రజలకు తాగునీటి కష్టం రానియ్యకుండా సకాలంలోనే నీటిని సరఫరా చేస్తోంది. బోర్డుకు నెలకు రూ.160 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా.. ఇందులో కేవలం రూ.120 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. ఈ డబ్బులతోనే జీతభత్యాలు, నిర్వహణ పనులు చేపడుతున్నారు. ఉచితంగా నీటిని సరఫరా చేయడంతో ప్రభుత్వంపై మరింత భారం పడనుంది.
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ లోని జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండిపోయాయి. దీంతో రెండేళ్ల పాటు నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు. గోదావరి, కృష్ణ జలాలను కొంత మేరా తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నగర ప్రజలు నీటి మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే మీ సేవ కేంద్రానికి వెళ్లి WWW.HMWSSB.COM వెబ్ సైట్ కి లాగిన్ అయి రిజిస్టర్ అవ్వాలన్నారు. నీటి సరఫరాకు సంబంధించిన వివరాల కోసం ఫోన్: 040-155313 నంబర్ కు సంప్రదించాలన్నారు.