కేసీఆర్ జ‌గ‌న్‌ను చూసి నేర్చుకోవాలా… కేసీఆర్ ఫ్రెండే చెప్పాడు

-

తెలంగాణ రాజకీయం అంతా గత కొద్ది రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికతో పాటు ఆర్టీసీ సమ్మె చుట్టూనే తిరుగుతోంది. అటు హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం కావడంతో కేసీఆర్ ఏ పార్టీ ఓకే చెబితే ఆ పార్టీ మద్దతు తీసేసుకుంటున్నారు. అటు సీపీఎం పోటీలో లేదు.. ఇప్పటికే టిఆర్ఎస్ కు సిపిఐ, వైసీపీ మద్దతు ప్రకటించాయి. సిపిఐ మద్దతు కోసం కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. సిపిఐ టిఆర్ఎస్ అభ్యర్థి శాపంపూడి సైదిరెడ్డికి మద్దతు ప్రకటించి మూడు రోజులు కూడా కాకుండానే… అప్పుడే మద్దతు ఉపసంహరించుకుంటామని వార్నింగ్ బెల్ మెగించేసింది. ఇందుకు కారణం ఆర్టీసీ స‌మ్మె కావడం విశేషం.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బుధవారం సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో కోదండరాం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పట్ల కేసీఆర్‌ వైఖరిని వారు తప్పుబట్టారు. ఈ క్ర‌మంలోనే సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడ వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలని… లేనిపక్షంలో హుజూర్‌న‌గర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశంపై పునరాలోచన చేస్తామని వెంకటరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

తమకు ప్రజా పోరాటాలు… ప్రజా సమస్యలే కీలకమని హుజూర్‌న‌గర్ లో టిఆర్ఎస్ కు మద్దతు తెలిపిన‌ప్పుడు ఆర్టీసి సమ్మె నోటీసు మాత్రమే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటామని… ఉద్యోగాలు తొల‌గిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కెసిఆర్ విధానాలు చూస్తుంటే నవ్వు వస్తుంద‌ని… పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులను చూసి అయినా కెసిఆర్ ఎంతోకొంత నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.

ఇక జ‌గ‌న్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే చాడ వెంక‌ట‌రెడ్డి ఈ విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కంపేరిజ‌న్ చేసి మ‌రీ కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేశారు. ఏదేమైనా ఆర్టీసీ కార్మికుల విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై ఇప్పుడు అక్క‌డ పెత్త ఎత్తున పోరాటాలు త‌ప్పేలా లేవు. మ‌రి ఈ టైంలో సీపీఐ సైతం మ‌ద్ద‌తుపై వార్నింగ్ ఇస్తుండ‌డంతో కేసీఆర్ ఐ డోన్ట్ కేర్ అంటారా ? వెన‌క్కు త‌గ్గుతారా ? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news