హైదరాబాద్ హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థినులకు లైంగిక వేధింపుల ఘటనపై తొలిరోజు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల పాటు రాష్ట్ర బాలల పరిరక్షణ కమిషన్ సభ్యులు విచారణ జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్ఓ హరికృష్ణను అధికారులు ప్రశ్నించారు. విద్యార్థినులు, సహచర ఉద్యోగుల నుంచి కమిషన్ సభ్యులు వివరాలను సేకరించారు. పూర్తిస్థాయిలో విచారణకు సమయం పడుతుందని కమిషన్ మెంబర్ రాగజ్యోతి తెలిపారు. మరోవైపు.. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్‌డీ పనిచేస్తున్న హరికృష్ణపై ఆరోపణలు రావడంతో ఆయన స్థానంలో సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
మేడ్చల్ జిల్లా యువజన అధికారిగా సుధాకర్ పనిచేశారు. అయితే స్పోర్ట్స్ స్కూల్ పరిణామాలపై తాను వ్యాఖ్యానించబోనని ఆయన చెప్పారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొల్పే ప్రయత్నం చేస్తానన్నారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసిన విషయం తెలిసిందే.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లో బాలికలపై ఓఎస్‌డీ హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పుడుతున్నాడనే మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష తర్వాత లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్‌డీ హరికృష్ణపై రాష్ట్ర ప్రభుత్వ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హరికృష్ణ తోసిపుచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్రంగా విచారణ జరిపించాలని హరికృష్ణ కోరారు.