కన్నడనాట రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీ ఉచితాలను ఎరగా వేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచితాల బాట పట్టింది. ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి నాలుగు హామీలను అమలు చేస్తామని చెబుతోంది. ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న హామీల వ్యూహం ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.
తాము అధికారంలోకి వస్తే ‘గృహజ్యోతి’ కార్యక్రమం ద్వారా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చింది. మహిళా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకుగానూ ‘గృహలక్ష్మి’ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతినెల రూ.2వేలు అందజేస్తామని ప్రకటించింది. ‘అన్న భాగ్య యోజన’ పేరుతో ప్రతి కుటుంబానికి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని తెలిపింది. నాలుగో హామీగా ‘యువనిధి’ కింద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల భత్యం అందజేస్తామని ప్రకటించింది.