బీసీ కుల గణననపై దూకుడుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. 60 రోజుల్లోనే పూర్తయ్యలా ఆదేశాలు..

-

కుల గణన.. ఇది దశాబ్దాల నాటి మాట.. కుల గణనను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు మద్దతు ఇస్తున్నాయి.. దీంతో కుల గణనపై కేంద్రం ఆచితూచి అడుగులేస్తుంటే విపక్షాలు మాత్రం గట్టిగా పట్టుబడుతున్నాయి.. దేశంలోనే తొలిసారిగా బీసీ కుల గణనను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోంది.. అయితే కొన్ని పార్టీలు కులగణను వ్యతిరేకించడానికి గల కారణాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది..

వచ్చే ఏడాది నుంచి జనాభా లెక్కల సేకరణను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ ప్రక్రియ 2026 వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.. జన గణన ముగిసిన అనంతరం లోక్సభ పునర్విభజన ప్రక్రియ ప్రారంభిస్తారు.. అది 2028లో ముగిసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.. జన గణనతో పాటు కులగణను కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కుల గణన తప్పనిసరి అంటూ వాదిస్తోంది..

1881లో మొదలైన జనగణన.. ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుంది.. షెడ్యూల్ ప్రకారం అయితే 2021 లోనే జరగాల్సి ఉంది.. అయితే కరోనా వైరస్ మహమ్మారితో అది వాయిదా పడింది.. అయితే గత మూడేళ్లుగా దీన్ని వాయిదా వేస్తూనే ఉన్నారు.. జాతీయస్థాయిలో రాష్ట్రాలవారీగా పథకాలు సంక్షేమ కార్యక్రమాల అమలుకు జనాభా లెక్కలే కీలకం.. అయితే ఇదే సమయంలో కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.. వారి డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

జన గణనకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కేంద్రా వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలోనే ఈ సర్వే నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.. వచ్చే ఏడాది చేపట్టే జనగణనలో జనరల్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల ఉప కులాల తో పాటు, మతం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.. అయితే జనగణనలో ఓబి సి స్థానంలో ఉప కులాలను కూడా చేర్చాలనేది విపక్షాల ప్రధాన డిమాండ్.

తెలంగాణలో నవంబర్ 6 నుంచి బీసీ కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించబోతోంది.. దేశంలోనే తొలిసారిగా ఇక్కడ కుల గణన చేపడుతున్నారు.. దీని తరువాత ఏ ఏ సంక్షేమ పథకాలకు ఎన్ని కోట్ల నిధులను కేటాయించాలని దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.. రెండు నెలల్లోగా కుల గణన పూర్తి చేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది.. ప్రస్తుతం తెలంగాణలో చేపట్టుతున్న కుల గణనలో 60 ప్రశ్నలను ప్రభుత్వం సిద్ధం చేసింది.. జీవన ప్రమాణాలతో పాటు రాజకీయ ఆర్థిక వంటి వాటిని క్షుణ్ణంగా సర్వే చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం.

బీసీ కులాల వివరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే చేపడుతుంది.. దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని సైతం నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.. అన్ని జిల్లాలలో కులగణన పై సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలను సైతం స్వీకరిస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కులగణను చేపడుతున్నామని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి బీసీలలో మైలేజ్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news