ఆ స్టేడియానికి మోదీ పేరు తీసేస్తాం.. గుజరాత్ మేనిఫెస్టోలో కాంగ్రెస్‌

-

ఎన్నికల వేళ గుజరాత్‌ ప్రజలపై కాంగ్రెస్‌ పార్టీ హామీల జల్లు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిస్తే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ మైదానం పేరు మారుస్తామని ప్రకటించింది. ఈ మేరకు గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ విడుదల చేశారు. మోదీ స్టేడియం పేరును సర్దార్‌ పటేల్‌ మైదానంగా మారుస్తామని తెలిపింది. గతంలో మెుతేరా పేరుతో ఉన్న మైదానాన్ని ఆధునీకరించిన బీజేపీ సర్కార్ ఇటీవల దానికి నరేంద్ర మోదీ స్టేడియంగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే మేనిఫెస్టోకు అధికారిక ముద్రవేస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగిరితే 10లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తేల్చిచెప్పింది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు ఇస్తామని పేర్కొంది. 3వేల ప్రభుత్వ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తామని.. మహిళలకు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చింది. వంటగ్యాస్‌ను రూ.500లకే అందించనున్నట్లు తెలిపింది. వీటితో పాటు అన్ని వర్గాల వారి సంక్షేమానికి హామీలు కురిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news