“తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉంది. టికెట్లు సరిగా ఇవ్వలేదు. పొత్తులు సరిగా పెట్టుకోలేదు. సరైన నాయకత్వం అందించలేకపోయారని అందుకే నష్టం జరిగిందని మొదటి సారి హైకమాండ్‌కు చెప్పా. రెండోసారి కూడా అదే తప్పు చేయడంతో ఆవేదనతో మాట్లాడా. మా లక్ష్యం ఒక్కటే కేసీఆర్‌ను గద్దె దింపాలి. కాంగ్రెస్ అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకుంటే అందరం కలసి కట్టుగా ముందుకెళ్తాం.
లేని పక్షంలో బీజేపీలో చేరడమా.. సొంత పార్టీ పెట్టలా అనేది నిర్ణయించుకుంటా. దేనికైనా నేను రెడీ. కేసీఆర్‌కు బుద్ధి చెప్పి.. దోపిడీని ఆపడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలకు నిజమైన బంగారు తెలంగాణ అందించాలన్నదే నా ఆశయం” అంటూ తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ నాయకత్వం మీద అసహనంగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఆయన ఉన్నారు. కాంగ్రెస్ లోవర్గ పోరు ఉన్నా సరే ఆయన మాత్రం తెలంగాణా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఆయనతో పాటుగా ఎంపీ రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్లు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. జగ్గారెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఎవరికి వారు హైకమాండ్ వద్ద తమ ప్రయత్నాలు చేస్తున్నారు.