కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఓ క్రిమినల్: రాహుల్ గాంధీ

కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు అశీష్ మిశ్రాపై గురువారం లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీ‌లో రైతుల హత్య కేసును ఉటంకిస్తూ అజయ్ మిశ్రా‌ ఓ క్రిమినల్ అని ఆరోపించారు. అతడిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని లేదా రాజీనామా అయినా చేయించాలని డిమాండు చేశారు.

అజయ్ మిశ్రా ఓ క్రిమినల్ అని, కేంద్ర మంత్రి కచ్చితంగా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండు చేశారు. లఖింపూర్ ఖేరిలో జరిగిన రైతుల హత్య గురించి మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించాలి. అందులో కేంద్ర మంత్రి ప్రమేయం ఉందని, ఇప్పటికే లఖింపూర్ ఖేరి సంఘటనను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) కుట్రగా నిర్ధారించిందని పేర్కొన్నరు.

లఖింపూర్ ఖేరీ ఘటనను సిట్ కుట్రా పేర్కొన్న నేపథ్యంలో ఉభయ సభల్లో చర్చకు డిమాండు చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. లఖింపూర్ ఖేరీ బాధితులకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించడంతో ఇరు సభలు మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడ్డాయి.