హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించినా హైకమాండ్ చిన్నారెడ్డికి అవకాశం ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన సీనియర్లు ప్రచారం కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రచారానికి దూరంగా ఉన్నవారితోనూ మాట్లాడుతున్నారు. కానీ.. అధికార ప్రతినిధి హర్షవర్దన్‌రెడ్డి వైఖరి కాంగ్రెస్ ను చిరాకు పెడుతుంది.అసలే కష్టాల్లో ఉన్నామని భావిస్తోన్న నేతలకు ఈ రెబల్ టెన్షన్ సమస్యగా మారింది.
కాంగ్రెస్ పార్టీలో చేరకముందు హర్షవర్దన్‌రెడ్డి పీఆర్టీయూ అధ్యక్షుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరే ముందు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట ఇచ్చారట. కండువా కప్పుకొన్నవెంటనే పీసీసీ అధికార ప్రతినిధిని చేశారు. తీరా ఎన్నికల నాటికి ఆ మాట గుర్తురాలేదో ఏమో.. చిన్నారెడ్డిని ఎంపిక చేయడంతో హర్షవర్దన్‌రెడ్డికి చిర్రెత్తికొచ్చిందట. ఇప్పుడు పార్టీ హ్యాండివ్వడంతో.. ఆయన ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. నామినేషన్ వేశారు. అదీ అలా ఇలా కాదు.. మంది మార్బలంతో వెళ్లి నామినేషన్ అందజేశారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి రెండేళ్లుగా హర్షవర్దన్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నట్టు సమాచారం. కొత్త ఓటర్ల నమోదు వంటి పనుల్లో బిజీగా ఉండిపోయారు. హర్షవర్దన్‌రెడ్డి పీఆర్టీయూ అధ్యక్షుడిగా చేయడంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు టీచర్ల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శరవేగంగా హర్షవర్దన్ కదుపుతున్న పావులు కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదట. అసలే కష్టకాలం నడుస్తోంది. ఇలాంటి సమయంలో రెబల్‌గా పోటీ చేస్తే.. మాజీ మంత్రి చిన్నారెడ్డికి కూడా ఇబ్బందేనని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
మహబూబ్‌నగర్ జిల్లాకే చెందిన పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి హర్షనవర్దన్‌రెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారట. సీఎల్పీకి ఆయన్ని పిలిచి మాట్లాడినట్టు తెలుస్తోంది. రేవంత్ చెప్పిందంతా విన్న హర్ష.. మీరు ఎన్నెన్నా చెప్పండి భాయ్.. నేను మాత్రం పోటీ నుంచి తప్పుకొనేదే లేదు అని ముఖం మీదే చెప్పేశారట. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వైరి పక్షాలు ఒక్కో విధంగా దాడి చేస్తున్నాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిని బరిలో దించిన టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చే ప్రయత్నాల్లో ఉంది. అటు చూస్తే హర్షవర్దన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే నామినేషన్ వేశారు. దీంతో ఆయనపై పార్టీ పరంగా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే బుజ్జగించే పనిలో ఉన్నారు నాయకులు. ఈ సమస్య నుంచి కాంగ్రెస్ పార్టీ ఎలా గట్టెక్కుతుందో చూడాలి.