కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ..?

-

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాపొరుగు రాష్ర్టాల్లో సాధిస్తున్న విజయాలు కాంగ్రెస్‌ నేతలకు ఊరటగా నిలుస్తున్నాయి. అంతేకాదు ఏపీలో కాంగ్రెస్‌ పూర్వవైభవంపై ఆ పార్టీ నేతల్లో కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి. కర్నాటక, తెలంగాణలో గెలుపుతో ఏపీలో కూడా ఫుల్‌ స్వింగ్‌లోకి వచ్చేలా వ్యూహాలకు పదను పెడుతున్నారు ఆ పార్టీ నాయకులు. ఏపీ విభజన జరిగి పదేళ్ళు పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మారింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రత్యేక హోదా విషయంలో ఎటూ తేల్చడం లేదు.

ఇటు ఏపీలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా హోదా సాధించడంలో విఫలమవుతున్నాయి. అయితే ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమంటున్నారు ఆ పార్టీ నాయకులు. ఇదే అజెండాతో రానున్న ఎన్నికలకు సిద్ధమవుతోంది కాంగ్రెస్‌.తెలంగాణలో వర్కవుట్‌ అయిన మార్పుకావాలి.. కాంగ్రెస్‌ రావాలి అనే నినాదం గట్టిగా వినిపించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో వినిపించిన నినాదమే ఏపీ కాంగ్రెస్‌ విధానంగా వ్యూహాలకు పదను పెడుతున్నారు పీసీసీ ప్రతినిథులు. పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విజయవాడలో జరిగిన ఏపీ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ విధానాలపై సుదీర్ఘ చర్చ సాగింది. కాంగ్రెస్‌ సీనియర్స్‌ రఘువీరారెడ్డి, జేడీ శీలం, పల్లం రాజు తదతర నేతలు చర్చోపచర్చలు జరిపారు. ఏపీలో కాంగ్రెస్‌ బలోపేతం సహా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించారు. కర్నాటక, తెలంగాణలో సాధించిన గెలుపునే బూస్ట్‌గా వై నాట్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే నినాదంతో మళ్లీ పూర్వవైభవం సాధించాలనే నిర్ణయానికి వచ్చారు పీసీసీ నేతలు.

కర్నాటక,తెలంగాణ రాష్ర్టాల్లో వచ్చిన విజయంతో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ నేతలూ యాక్టివ్‌ మోడ్‌లోకి వచ్చారు. తెలంగాణలో అనుసరించిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికలకు వెళ్లాలని ఏపీ కాంగ్రెస్‌ భావిస్తోంది. బెజవాడ మీటింగ్‌లో తీసుకున్న నిర్ణయాలను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్ళే పనిలో ఉన్నారు పీసీసీ నేతలు. త్వరలోనే ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో సమావేశం అవుతామని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఓ యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని సమావేశం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఐదు గ్యారెంటీలతో కర్నాటకలో పాగా వేసి, ఆరు గ్యారంటీలతో తెలంగాణలోనూ అధికారం పీఠం దక్కించుకున్నారు. ఈదే క్రమంలో ఏపీలో సింబాలిక్‌గా 7 గ్యారంటీలతో ముందుకెళ్ళాలని ఇక్కడ కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ప్రధాన హామీగా ఎన్నికల్లో విస్తృత ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

రాహుల్‌ , ప్రియాంక గాంధీలను త్వరలో ఏపీకి తీసుకువచ్చేందుకు పీపీసీ బృందం ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాహుల్‌ నాయకత్వంలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమాన్ని, ప్రియాంకగాంధీ సారథ్యంలో అమరావతి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు ఇది వరకే ప్రకటించారు.ఈ మేరకు అగ్ర నేతలను ఒప్పించి ఏపీకి రప్పించేందుకు భారీ స్థాయిలో కసరత్తు మొదలుపెట్టారు. ఏపీలో కాంగ్రెస్‌ ని గెలిపించే బాధ్యతలను షర్మిలాకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని బట్టి చూస్తే ఏపీలో విజయంపై ధీమాగా ఉన్నారు కాంగ్రెస్‌ నాయకులు.వరుస విజయాలతో బీజేపీ ప్రాభవాన్ని తగ్గించాలనే దిశగా అటు ఏఐసీసీ కూడా అడుగులు వేస్తోంది.విభజనకు కారణమైన కాంగ్రెస్‌ని మరి ఏపీ ప్రజలు క్షమిస్తారో లేదో చూడాలి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు చే స్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో… వాటిని ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారో తెలియాలంటే మరి కొన్ని నెలలు నిరీక్షించాలి.

Read more RELATED
Recommended to you

Latest news