తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేపు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మినహా పార్టీ సీనియర్ నాయకులు అందరూ హాజరు అవుతున్నారు. కాగ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల నుంచి అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగడంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నాయకులు మాత్రమే హాజరు అవుతుండటంతో ఈ భేటీ మరింత ప్రాధన్యతను సంతరించుకుంది.
కాగ ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. వీహెచ్ కీలక పాత్ర వహిస్తున్నట్టు తెలుస్తుంది. మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వీహెచ్ స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. అలాగే ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
అలాగే మాజీ మంత్రి గీతా రెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ భేటీకి వెళ్తున్నట్టు తెలస్తుంది. కాగ ఈ సమావేశంలో పీసీసీ రేవంత్ రెడ్డి తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ మణిక్కం ఠాకూర్ లపై అధిష్టానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే తమ భవిష్యత్తు కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.