తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో బతుకమ్మ పండగ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బంతుకమ్మ పండగను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు మొదలు పెట్టింది. తెలంగాణ ఆడపడుచులకు ప్రతీ ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉండనున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. నిన్నటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ సర్కార్.
ఇందులో భాగంగానే… ఇవాళ జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని…కాన్పు అయిన తల్లికి సొంత తల్లిదండ్రులు, ఆత్త మామలు, కట్టు కున్న మొగుడు కూడా కొత్త బట్టలు తేవడం లేదని చెప్పారు రాజయ్య. ఇలాంటి పరిస్థితుల్లో అత్తమామ కేసీఆరే అవుతున్నాడు.. అమ్మా, అయ్యా కేసీఆరే అవుతున్నాడు.. భర్త కూడా ఆయనే అయిపోయి మొత్తం చీరలు, బట్టలు సర్వం అందిస్తున్నాడు అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు రాజయ్య. ఇక తాజాగా చేసిన రాజయ్య వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాజయ్య చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.