తెలంగాణాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. తెలంగాణాలో ఈ ఒక్కరోజే 49 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 453 కి చేరుకుంది. కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య చూస్తే 45 మందిగా ఉంది. దీనితో ఒక్కసారిగా తెలంగాణాలో కలకలం రేగింది. కరోనా తగ్గినట్టే తగ్గి పెరగడం తో రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది
తెలంగాణాలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 11 మంది మరణించారు. దీనిపై తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర మాట్లాడారు. తాము కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. ఇక నుంచి క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను దాదాపు మూడు వేల మందిని ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు.
తెలంగాణాలో ప్రస్తుతం 397 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. మర్కాజ్ యాత్రికుల నుంచే కరోనా కేసులు భారీగా పెరిగాయి. వారి తర్వాతే ఈ కేసుల సంఖ్య వేగంగా పెరగడం తో ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. కఠిన నిర్ణయాలు తీసుకోవడమే వలనే తెలంగాణా రాష్ట్రంలో కట్టడి లో ఉందని సిఎస్ సోమేశ్ కుమార్ మీడియాతో వ్యాఖ్యానించారు.