దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన బాధితుల సంఖ్య 5 లక్షల మార్క్‌ను దాటింది. మొత్తం 5,06,972 కరోనా కేసులు భారత్‌లో ఇప్పటి వరకు నమోదయ్యాయి. 15,662 మంది చనిపోయారు. 2,94,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కాగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1016 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఐసీఎంఆర్ తెలియజేసింది. వీటిలో ప్రభుత్వాలకు చెందిన ల్యాబ్‌లు 737 ఉండగా, 279 ల్యాబ్‌లు ప్రైవేటుకు చెందినవి. కాగా గడిచిన 24 గంటల్లో మొత్తం దేశవ్యాప్తంగా 2,15,446 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో జరిగిన కరోనా టెస్టుల సంఖ్య 77,76,228 కు చేరుకుంది.
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. శుక్రవారం మహారాష్ట్రలో కొత్తగా 5024 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 3460, తమిళనాడులో 3645 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నవారి శాతం 58.25గా ఉంది.