కరోనా పరీక్షకు సాంపిల్స్‌ ఎలా తీస్తారు? – వీడియో

-

కరోనా – యావత్ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి. లెక్కకు మిక్కిలి కేసులతో, అంచానాలకు మించిన మరణాలతో లోకం అతలాకుతలం అవుతోంది. కరోనా ఎవరికి సోకిందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమైపోయింది. పరీక్షాకేంద్రాలలో రోగి నమూనాలు ఎలా తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం.

కరోనా పరీక్షాకేంద్రంలో అనుమానితుడిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేస్తారు. ముందుగా అతడికి అన్ని రకాల రక్షణ కవచాలు ధరింపజేసి, సాంపిల్‌ సేకరణ విభాగానికి తరలిస్తారు. ఆ విభాగం పూర్తిగా అద్దాలతో మూసిఉంటుంది. దాని బయట రోగిని కూర్చోబెడతారు. లోపల ఉన్న ల్యాబ్‌ టెక్నీషియన్‌ పిపిఈ ధరించి, గ్లోవ్స్‌ వేసుకుని, సానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకుని పనికి ఉపక్రమిస్తాడు.

image source : newscientist.com

గ్లాస్‌ క్యాబిన్‌కు రెండు చేతులు పట్టేలా రెండు పెద్ద రంధ్రాలు ఉంటాయి. వాటికి రోగివైపు మరో జత గ్లోవ్స్‌ అతికించి ఉంటాయి. అక్కడ ఉన్న ప్లాట్‌ఫారంపై ఒక పక్క సీల్‌ చేసిఉన్న స్వాబ్‌ ప్యాకెట్లు, మరోపక్క గాజు ట్యూబులు, కోల్డ్‌ స్టోరేజి బాక్సు ఉంటాయి. ముందుగా ఆ క్యాబిన్‌ రంధ్రాలకు అతికించి ఉన్న గ్లోవ్స్‌లో తన చేతులు దూర్చి, పక్కన ఉన్న బాక్స్‌లో నుండి స్వాబ్‌ ( ఒక పుల్లలాంటి దానికి చుట్టబడి ఉండే దూది – మనం వాడే ఇయర్‌ బడ్‌ లాంటిది ) ప్యాకెట్‌ను చించి అందులోనుండి ఒక స్వాబ్‌ను బయటికి తీస్తాడు. తర్వాత రోగిని నోరు తెరవమని, గొంతులోకి ఈ స్వాబ్‌ను దూర్చి, ఆక్కడి స్రావాలతో తడిచేట్టుగా అటుఇటూ తిప్పి బయటికి తీస్తాడు. దాన్ని జాగ్రత్తగా ఒక గాజు ట్యూబులోకి జారవిడిచి, గట్టిగా మూత బిగించి, కోల్డ్‌ సోరేజీ బాక్సులో పెడతాడు. ఇదే పద్ధతిలో ముక్కులో నుండి కూడా సాంపిల్‌ తీస్తారు. ఆ గాజు ట్యూబ్‌ మీద ఉన్న నెంబరునే తన వద్ద నున్న రిజిష్టరలో రాసుకుని దానికి పేషెంటు వివరాలు జత చేస్తారు.

ఇక అక్కన్నుండి ఆ బాక్స్‌ కొవిడ్‌ ల్యాబొరేటరీకి వెళుతుంది. అక్కడ బాక్సులో ఉన్న సాంపిల్స్‌ బయటకు తీసి పరీక్షించి, ఫలితం తెలియజేస్తారు. ఇదీ స్థూలంగా పరీక్షలు, సాంపిల్స్‌ సేకరించే విధానం. ఈ కింది విడియోలో ఇదంతా వివరంగా ఉంది. చూడండి….

Read more RELATED
Recommended to you

Latest news