ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకా సంస్థలు కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరిట భారత్‌లో పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్‌కు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇప్పటికే దేశంలో 17 చోట్ల 1600 మందితో ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ కూడా చేపట్టింది. కాగా మరో 73 రోజుల్లో ఈ వ్యాక్సిన్ దేశంలోని ప్రజలకు ఉచితంగా పంపిణీ అవుతుందని సీరమ్ ఇనిస్టిట్యూట్ చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవసాగింది.
ఇక మీడియా సంస్థలన్నీ కూడా ఈ వార్తను తమ తమ వెబ్‌సైట్లలో రాశాయి. కాగా దీనిపై సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పష్టతనిచ్చింది. ఈ వార్త అబద్దమని, తాము అలా చెప్పలేదని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని, 73 రోజుల్లో వ్యాక్సిన్ వస్తుందని తాము చెప్పలేదని పేర్కొంది. వ్యాక్సిన్‌కు చేపట్టిన ట్రయల్స్ అన్నీ సక్సెస్ అయితేనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని, కాకపోతే కేంద్రం తమకు వ్యాక్సిన్‌ను వేగంగా, పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు అనుమతులు ఇచ్చిందని సీరమ్ ఇనిస్టిట్యూట్ స్పష్టం చేసింది.
కాగా సీరమ్ ఇనిస్టిట్యూట్ తోపాటు దేశంలో భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థలకు చెందిన వ్యాక్సిన్లకు కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా వ్యాక్సిన్లు అన్నీ మరో 3 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.