గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిలో కరోనా వైరస్ కేవలం 72 గంటల వరకు మాత్రమే జీవించి ఉంటుందని సైంటిస్టుల పరిశోధనలో తాజాగా వెల్లడైంది. టర్కీలోని స్టేట్ రీసెర్చి సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ వెక్టార్ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు వారు ఓ రిపోర్టును కూడా ప్రచురించారు. ఇక నీరు మరిగే ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ అందులో ఏ మాత్రం బతికి ఉండదని, వెంటనే చనిపోతుందని వారు తెలిపారు.
గది ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ఉండే కరోనా వైరస్‌లో 90 శాతం వైరస్ 24 గంటల్లో చనిపోతుందని, 99.99 శాతం వైరస్ చనిపోయేందుకు 72 గంటల సమయం పడుతుందన్నారు. అదే నీరు బాగా మరుగుతుంటే అందులో కరోనా వైరస్ బతికి ఉండదని, వెంటనే చనిపోతందని తెలిపారు. అందువల్ల నీటి ఉష్ణోగ్రతకు అనుగుణంగా కరోనా వైరస్ జీవితకాలం ఉంటుందని తేల్చారు.
అసలు తాజా నీరు, సముద్రపు జలాల్లో కరోనా వైరస్ ఎక్కువ సమయం పాటు జీవించి ఉండలేదని, అది ఆయా ప్రాంతాల్లో వృద్ధి చెందలేదని కూడా సైంటిస్టులు తేల్చారు. ఇక స్టెయిన్‌లెస్ స్టీల్, లినోలియం గ్లాస్, ప్లాస్టిక్, సెరామిక్ ఉపరితలాలపై కరోనా వైరస్ 48 గంటల పాటు ఉంటుందని తేల్చారు. అయితే ఇండ్లలో వాడే చాలా వరకు హౌస్‌హోల్డ్ డిసిన్ఫెక్టెంట్లు కరోనా వైరస్‌ను చంపుతాయని, అదే 30 శాతం ఈథైల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ గాఢత ఉన్న ద్రావణాలైతే కొన్ని లక్షల ఇతర వైరస్ కణాలను అర నిమిషంలోనే చంపుతాయన్నారు. అదే 60 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ గాఢత ఉన్న ద్రావణాలు అయితే కరోనా వైరస్‌ను క్షణాల్లోనే చంపుతాయన్నారు. క్లోరిన్ ద్రావణాన్ని పిచికారీ చేసినా కేవలం 30 సెకన్లలోనే ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్ నశిస్తుందని అన్నారు.