కరోనా మరోసారి ప్రపంచాన్ని వణికించేందుకు రెడీ అయింది. మూడేళ్ల క్రితం కోరలు చాచడం మొదలుపెట్టిన కొవిడ్.. గత ఆరు నెలలుగా కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఈ మహమ్మారి అంతరించింది అనుకునేలోపే మరోసారి విజృంభిస్తోంది. భారత్‌లో తాజాగా కరోనా కొత్త కేసులు 6వేలు దాటినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు కరోనా బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని తెలిపారు. కాబట్టి కొత్త వేరియంట్ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండొచ్చని వీరు అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా- గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం.