మనలో చాలామంది తలనొప్పి వల్లో, కళ్లు సరిగ్గా కనిపించక పోవడం వల్లో కళ్లద్దాలు వాడుతూ ఉంటారు. అయితే కళ్లద్దాల వల్ల సైతం కరోనా బారిన పడే అవకాశం ఉంది. తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కళ్లద్దాలపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది రోజులు కరోనా వైరస్ జీవించగలదని తేలింది. మనం బయటకు వెళ్లిన సమయంలో, ఆస్పత్రులు, మెడికల్ దుకాణాలకు వెళ్లిన సమయంలో కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటే మంచిది.
అయితే కళ్లద్దాలను శుభ్రం చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మోనియా, బ్లీచింగ్ లతో కూడిన ద్రావణాలు, ఆల్కహాల్ తో కూడిన శానిటైజర్లను కళ్లద్దాలు శుభ్రం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించకూడదు. పొడి వస్త్రం లేదా పాత్రలు కడిగేందుకు ఉపయోగించే సబ్బు నురగను ఉపయోగించి కళ్లద్దాలను శుభ్రం చేసుకుంటే అద్దాలపై ఉండే వైరస్ సులభంగా తొలగుతుంది.
ప్రయాణాలు చేసే సమయంలో కళ్లద్దాలను శుభ్రం చేసుకోవడం కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వినియోగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులు సైతం ఈ విషయాలు నిజమేనని తెలిపారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు కళ్లద్దాలు వాడితే వాటిని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని ఎల్వీ ఆస్పత్రి వైద్యులు సూచించారు.