రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. 2 వేల మందికిపైగా…

చైనాలోని వుహాన్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను భయపెడుతోంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో ప్రజలు చైనాలో ఈ వైరస్‌ బారిన పడగా, నేటికి 25మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ఈ వైర‌స్‌ వంద‌ల నుంచి వేల‌కు చేరుకుంది. చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి, ఆపై ఒక్కో దేశానికీ విస్తరిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్, రోజురోజుకూ మరింతగా విజృంభిస్తోంది. ఇప్పటికే చైనాలో 2 వేల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారని చైనా అధికారులు స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 56 మంది మరణించారని ఆదివారం నాడు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. వైరస్ ను అరికట్టడంపై పోలిట్ బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య శాఖ నిపుణులు కృషి చేస్తున్నారని అన్నారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. దేశంలోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.