మన దేశంలో సోషల్ మీడియాలో రోజు రోజుకీ షేర్ అవుతున్న నకిలీ వార్తల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. సదరు వార్తలను చాలా మంది నిజమే అని నమ్ముతున్నారు. దీంతో చాలా ఆస్తి నష్టం, కొన్ని సార్లు ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. ఇక ఇటీవలి కాలంలో కరోనా వైరస్ వల్ల అనేక నకిలీ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందులో ఒకటి.. కోళ్లకు కరోనా వ్యాప్తి చెందుతుందని, అందువల్ల చికెన్ తినకూడదని ఎక్కువగా వాట్సాప్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, అంతా అబద్ధమేనని వైద్యులు తేల్చి చెబుతున్నారు.
చైనాలో కరోనా వైరస్ మొదటగా బయట పడినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో కనీసం ఒక్క కోడికి కూడా కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదని, కనీసం బర్డ్ ఫ్లూ కూడా రాలేదని వైద్యులు అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫొటోలు ఇప్పటివి కాదని, ఆ కోళ్లకు రానిఖెట్ అనే వ్యాధి వచ్చిందని, అది కరోనా కాదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆ కోళ్లు కరోనా వైరస్ సోకి అలా అయ్యాయని, కనుక చికెన్ తినకూడదని పనిగట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఇది నిజం కాదని, ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని వైద్యులు అంటున్నారు.
కోళ్లలో కరోనా వైరస్ లేదని నిర్దారిస్తూ ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రకటన జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ రిటైర్డ్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ పి.వెంకటేశ్వర్ రెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు కూడా. కనుక ఎవరూ వాట్సాప్‌లో వచ్చే పుకార్లను నమ్మకూడదని, అందరూ నిర్భయంగా చికెన్ తినవచ్చని అంటున్నారు..!