ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అనేక దేశాల్లో కరోనా వైరస్‌కు గాను తయారు చేసిన వ్యాక్సిన్లకు ఫేజ్ 1, 2, 3 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, రష్యా దేశాలు అన్ని దేశాల కన్నా ముందే ఉన్నాయి. రష్యా ఆగస్టు 2వ వారం నుంచే కరోనా వ్యాక్సిన్‌ను ప్రజా పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బ్రిటన్ ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఆ దేశంలో, మన దేశంలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. ఇక అమెరికా కూడా ఈ విషయంలో ముందే ఉంది. అక్కడి మోడెర్నా కంపెనీకి అమెరికా ఇప్పటికే బిలయన్ డాలర్ల సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే భారత్‌లో మరోవైపు దేశీయ ఫార్మా కంపెనీలు భారత్ బయోటెక్, జైడస్ కాడిలాలు రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు ప్రస్తుతం ఇంకా ఫేజ్ 1 ట్రయల్సే జరుగుతున్నాయి. ఈ క్రమంలో మన దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదిలా ఉండగా.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్‌ను మన దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయనుంది. అందులో సగం వ్యాక్సిన్‌ను మాత్రమే మనకు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇస్తామని చెప్పింది. మిగిలిన సగం బ్రిటన్‌కు వెళ్తుంది.
ఇక మరో దేశీయ ఫార్మా కంపెనీ వోక్‌హార్డ్ లక్షల కొద్దీ కరోనా వ్యాక్సిన్ డోసులను తయారు చేసి బ్రిటన్‌కు ఇచ్చేందుకు గాను తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కంపెనీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ను మన దేశంలో ఉత్పత్తి చేసి బ్రిటన్‌కు సరఫరా చేయనుంది. ఈ క్రమంలో దాదాపుగా అన్ని దేశాలు వ్యాక్సిన్ కోసం ఫార్మా కంపెనీలతో ఇప్పటికే డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. కానీ భారత్ ఈ విషయంలో కాస్త వెనుకబడిందని అంటున్నారు. అదే జరిగితే మన దేశ పౌరులకు వ్యాక్సిన్ అందేందుకు చాలా సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.