ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం జగన్ దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్టు అసెంబ్లీలో తెలపడం పై స్పందించారు .ఎస్సీల్లో దళిత క్రైస్తవులను చేర్చడం సరికాదని వెల్లడించారు సోము వీర్రాజు. ఏపీ ప్రభుత్వ తీర్మానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చర్యలు మతమార్పిడులను ప్రోత్సహించేలా ఉన్నాయని సోము వీర్రాజు విమర్శించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యలపై ఈ నెల 27న గవర్నర్ ను కలుస్తాం అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను అంకెల గారడీగా అభివర్ణించారు ఆయన. అసెంభ్లీ సాక్షిగా ఆర్ధిక మంత్రి బుగ్గన అంకెల గారిడీతో మాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విదేశీ ప్రముఖల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బడ్జెట్ కు తన వాదనలను సమర్ధించుకుంటూ రాష్ట్రప్రజలకు అవాస్తవాలను చెప్పారని విమర్శించారు. ఆర్ధిక మంత్రి వైఖరిని తీవ్రంగా తప్పుబడుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర నిధులు, పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్పతనంగా శాశనసభలో ఎలా చెబుతారని సోము ప్రశ్నించారు. ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తీసుకునే రుణాలు ఎంత అనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు. కనీసం కాగ్ కు కూడా నివేదిస్తున్నారో లేదో తెలియని గందరగోళం ప్రభుత్వంలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది అని అన్నారు ఆయన.