న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వ్యాపించదని, కనుక ప్రజలు నిర్భయంగా వాటిని చదవవచ్చని అన్నారు. న్యూస్ పేపర్ల ద్వారా కరోనా వస్తుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు, హాకర్‌ను పిలిచి న్యూస్ పేపర్ తెప్పించుకుని చదవండి, కరోనా వైరస్ కేవలం గాలిలోని తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది, కనుక న్యూస్ పేపర్లను నిరభ్యంతరంగా చదువుకోవచ్చు.. అని మంత్రి అన్నారు.
కాగా ఇదే విషయమై ప్రధాని మోదీ కూడా ఇటీవలే వ్యాఖ్యలు చేశారు. న్యూస్ పేపర్లు చాలా సురక్షితమని, వాటి వల్ల కరోనా వ్యాపించదని, వాటిని చదవవచ్చని అన్నారు. సరైన సమాచారాన్ని అందించడంలో వార్తా పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.
కోవిడ్ 19 వార్తా పత్రికల ద్వారా వ్యాప్తి చెందుతుందని అంతర్జాతీయంగా, జాతీయంగా ఇప్పటి వరకు ఏ సైంటిస్టూ నిరూపించలేదు. కోవిడ్ 19 ఉన్నవారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే ఆ వైరస్ ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది. వార్తా పత్రికల ద్వారా కోవిడ్ వ్యాపించిన కేసులు కూడా ఎక్కడా లేవు. కనుక న్యూస్ పేపర్ల్ ద్వారా కోవిడ్ వ్యాప్తి చెందుతుందని సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజల నమ్మరాదు.. అని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) డైరెక్టర్ సుజిత్ కె సింగ్ అన్నారు.