కరోనా వ్యాప్తి నేపథ్యంలో భువనేశ్వర్ ఐఐటీ, ఎయిమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. చలికాలంలో కరోనా వ్యాప్తి భారత్‌లో అత్యంత భీకరస్థాయికి చేరుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కరోనా వ్యాప్తి క్షీణతకు కారణమవుతుందని, వాతావరణంలో 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే కరోనా కేసుల నమోదులో 0.99 శాతం తగ్గుదల కనిపిస్తుందని వివరించారు. కేసుల రెట్టింపుకు దాదాపు 1.13 రోజులు ఎక్కువ టైం పడుతుందని చెప్పారు.
అలాగే గాలిలో తేమ శాతం పెరిగితే వైరస్ వృద్ధి రేటు తగ్గుతున్నట్టు, కేసుల రెట్టింపు సమయం కూడా 1.18 రోజులు పెరుగుతున్నట్టు గుర్తించామన్నారు. కాగా, దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య 10,77,618 కి చేరుకుంది. అలాగే మృతులు సంఖ్య 26,816కు చేరాయి. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని కొత్తగా 23,672 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,77,422 మంది కోలుకున్నారు. ఇంకా 3,73,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి.