కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (17-07-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శుక్రవారం (17-07-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 17th july 2020

1. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పట్ల ఎవరూ భయపడవద్దని అన్నారు. కరోనా పట్ల ఎవరూ అజాగ్రత్తగా ఉండరాదన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్లవద్దని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు.

2. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కును ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇకపై ఇండ్ల నుంచి బయటకు వెళ్లేవారు అక్కడ తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించని వారిపై తగిన చర్యలు తీసుకుంటారు.

3. అధిక బ‌రువు ఉన్నవారికి క‌రోనా వ్యాపించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టుల అధ్యయ‌నంలో వెల్లడైంది. ఇట‌లీకి చెందిన యూనివ‌ర్సిటీ ఆఫ్ బొలొగ్నాకు చెందిన ప‌రిశోధ‌కులు కోవిడ్ బారిన ప‌డ్డ 500 మంది పేషెంట్లపై అధ్యయ‌నం చేసి ఈ వివరాలను వెల్లడించారు. బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండేవారికి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు.

4. బెంగళూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయితే ఆ లాక్‌డౌన్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు బెంగళూరు మేయర్‌ గౌతం కుమార్‌ ప్రకటించారు.

5. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,956 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 687 మంది చనిపోయారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,03,832 కు చేరుకుంది. మొత్తం 25,602 మంది చనిపోయారు. 6,35,756 మంది కోలుకున్నారు. 3,42,473 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

6. కరోనా కట్టడికి తొలి వ్యాక్సిన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై నిర్వహించిన మానవ ప్రయోగాల్లో ప్రోత్సాహకర ఫలితాలు వెల్లడయ్యాయని పరిశోధకులు తెలిపారు. ఇక హ్యూమన్‌ ట్రయల్స్‌ ఫేజ్‌ 1కు చెందిన ఫలితాలను సదరు యూనివర్సిటీ పరిశోధక బృందం సోమవారం విడుదల చేయనుంది.

7. మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒక్క రోజే అక్కడ కొత్తగా 8,308 కరోనా కేసులు నమోదయ్యాయి. 258 మంది ఒక్క రోజులోనే చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,92,589కు చేరుకుంది. మొత్తం 11,452 మంది చనిపోయారు. మొత్తం 1.60 లక్షల మంది కోలకున్నారు. 1.20 లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

8. దేశీయ ఫార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ దేశంలో 12 ప్రాంతాల్లో మొత్తం 375 మంది వాలంటీర్లతో తన కోవ్యాక్సిన్‌కు గాను క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించినట్లు తెలిపింది. ఈ నెల 15వ తేదీన ట్రయల్స్‌ ప్రారంభించామని తెలియజేసింది. అయితే ప్రస్తుతం మొదటి దశ ట్రయల్స్‌ ప్రారంభం కాగా అవి ఎప్పటికి పూర్తవుతాయి, ఎప్పుడు రెండో దశ, మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభం అవుతాయి.. అన్న వివరాలను ఇంకా వెల్లడించలేదు.

9. దేశవ్యాప్తంగా కరోనా రోజు రోజుకీ విజృంభిస్తుండడంతో అనేక చోట్ల లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. మహారాష్ట్ర, బీహార్‌, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం సహా అనేక రాష్ట్రాల్లో పలు చోట్ల లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. కేవలం వ్యవసాయ పనులు, అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తున్నారు.

10. ప్రపంచ దేశాలు కరోనా వ్యాక్సిన్‌ కోసం క్లినికల్‌ట్రయల్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రష్యాకు చెందిన పలువురు హ్యాకర్లు మాత్రం ఇతర దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌కు గాను సైంటిస్టులు చేస్తున్న ప్రయోగాలకు సంబంధించిన డేటాను చోరీ చేసే యత్నాల్లో ఉన్నారని బ్రిటన్‌ ఆరోపించింది. వ్యాక్సిన్‌ కోసం పనిచేస్తున్న పరిశోధనా కేంద్రాలు, ఫార్మా కంపెనీలపై సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news