కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభాన్ని తెచ్చి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 555 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. 200 మిలియన్ల మంది ఉన్నత విద్య చదివే విద్యార్థులపై కరోనా ప్రభావం పడింది. ఇక భారత్‌లో మే వరకు నిరుద్యోగం 27.1 శాతానికి చేరుకోగా, మొత్తం దేశవ్యాప్తంగా 122 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. కేవలం మార్చి, ఏప్రిల్ నెలల్లోనే అంత మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఈ మేరకు ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం కోర్స్ ఎరా తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.
ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం అనేక మంది విద్యార్థులు కాలేజీలకు, విద్యాభ్యాసానికి దూరంగా ఉంటున్నారు. దీంతో వారు కనీసం తమ నైపుణ్యాలను అయినా పెంచుకోవచ్చని చెప్పి ఆన్‌లైన్‌లోనే పలు కోర్సులను నేర్చుకుంటున్నారు. అలా చదువుతున్న వారి సంఖ్య 37.5 మిలియన్లుగా ఉందని కోర్స్ ఎరా వెల్లడించింది. ఇక తమ ప్లాట్‌ఫాంపై బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్ తదితర కోర్సులను నేర్చుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని కోర్స్ ఎరా తెలిపింది.
అయితే డేటా సైన్స్‌లో నిజానికి భారతీయ అభ్యర్థుల్లో తగిన నైపుణ్యాలు లేవని నివేదికలు చెబుతున్నాయి. దీని వల్ల భారత్ ఏటా దాదాపుగా రూ.332 బిలియన్ల ఆదాయాన్ని కోల్పోతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్లే భారత్ డేటా సైన్స్ రంగంలో ప్రపంచ దేశాల్లో 51వ ర్యాంకులో ఉందని, అదే ఈ రంగంలో అభ్యర్థులు మరింత నైపుణ్యాలను నేర్చుకుని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే తద్వారా ర్యాంకు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇక ప్రస్తుతం డేటా సైన్స్‌కు మార్కెట్‌లో 1200 శాతం వరకు డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అందువల్ల ఈ కోర్సులో శిక్షణ తీసుకుని నైపుణ్యాలను పెంచుకునే వారికి భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు.