కోవిడ్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దేశాలకు దేశాలు కోవిడ్ దెబ్బతో విలవిల్లాడుతున్నాయి. లక్షల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. వైరస్ తన రూపును మార్చుకుని కొత్తకొత్త వేరియంట్ల రూపంలో ప్రజలపై అటాక్ చేస్తోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రజలు మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం పిల్లల్లో మానసిక పరిస్థితిపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపినట్లు తెలిసింది. ముఖ్యంగా వారి బాల్యానికి అంతరాయం కలిగించడం వల్ల పిల్లలు చాలా ప్రభావితమయ్యారని అధ్యయనం తెలిపింది. కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి పిల్లల్లో మానసిక సమస్యలు మొదలయినట్లు సర్వే తెలిపింది.కార్డిఫ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, 10-11 సంవత్సరాల వయస్సు పిల్లల్లో నాలుగింట ఒక వంతు మంది పాండమిక్ సమయంలో అధికంగా మానసిక, భావోద్వేగ సమస్యలతో బాధపడ్డారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్, ఎవాల్యుయేషన్, కాంప్లెక్సిటీ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ పబ్లిక్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ ప్రకారం, పిల్లలు తమ బంధువులు, స్నేహితులు కరోనా బారిన పడటం తీవ్రంగా వేధించిన అంశంగా చెబుతున్నారు. సర్వే ప్రకారం అత్యంత సంపన్నుల కుటుంబాల పిల్లలతో పోలిస్తే, పేదరికం నుంచి వచ్చిన పిల్లలు రెట్టింపు స్థాయిలో మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది సదురు అధ్యయనం.