కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నా.. చాలా మంది ఈ వైరస్ బారిన పడి కోలుకుంటున్నారు కూడా. సాధారణంగా కోవిడ్ బారిన పడ్డవారు కోలుకునేందుకు కనీసం 14 రోజుల వరకు సమయం పడుతోంది. ఇక కొందరికి కొద్ది రోజులు ఆలస్యం అవుతోంది. అయితే ఒక్కసారి కరోనా బారిన పడి కోలుకున్నాక.. 3 నెలల్లోగా శరీరంలో ఉండే రోగ నిరోధకత పోతుందని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన పరిశోధకులు తాజాగా కోవిడ్ నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత దాదాపుగా 3 నెలల వరకు వారిలో కోవిడ్ యాంటీ బాడీలు అలాగే ఉన్నాయని, 3 నెలల తరువాత అవి తగ్గాయని, అంటే కోవిడ్ పట్ల వారు రోగ నిరోధకత (ఇమ్యూనిటీ)ని కోల్పోయారని అన్నారు. అందువల్ల కోవిడ్ బారిన పడ్డవారికి మళ్లీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. కనుక వ్యాక్సిన్ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు.
సాధారణంగా మన శరీరానికి ఏదైనా వైరస్ సోకి మనం కోలుకున్నాక.. తిరిగి అదే వైరస్ సోకితే అప్పటి వరకు శరీరం ఆ వైరస్‌కు అనుగుణంగా యాంటీ బాడీలను తయారు చేసుకుంటుంది. ఈ క్రమంలో రెండో సారి అదే వైరస్ సోకితే అది మనపై పెద్దగా ప్రభావం చూపించదు. ప్రభావం చూపించే లోపే శరీరంలోని ఆ వైరస్‌కు చెందిన యాంటీ బాడీలు ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అయితే కోవిడ్ విషయంలో అలా జరగడం లేదని, కోవిడ్ బారిన పడ్డవారు కోలుకున్నాక 3 నెలల్లో వారిలో ఉన్న యాంటీ బాడీలు తగ్గి, వారిలో కోవిడ్ పట్ల ఇమ్యూనిటీ కూడా తగ్గుతుందని అంటున్నారు. అందువల్ల ఒక్కసారి కరోనా సోకిన వారికి రెండో సారి కూడా సోకే చాన్స్ ఉంటుందంటున్నారు. కనుక వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని వారు అభిప్రాయపడుతున్నారు.