స్థూలకాయం, డయాబెటిస్ ఉన్నవారికి, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, వారికి ఇన్ఫెక్షన్ తీవ్రం అయ్యి చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని ఇప్పటికే సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించిన విషయం విదితమే. అయితే ఇంకో రెండు వ్యాధులను కూడా ఈ జాబితాలో సైంటిస్టులు చేర్చారు. అవి దెమెంటియా, అల్జీమర్స్. ఈ రెండు వ్యాధులతో బాధపడేవారికి కూడా కోవిడ్ రిస్క్ ఎక్కువేనని బ్రెజిల్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు.
యూనివర్సిటీ ఆఫ్ సావో పావో, బుటాంటన్ ఇనిస్టిట్యూట్, ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనెరియోలకు చెందిన పరిశోధకులు సంయుక్తంగా అధ్యయనం చేపట్టారు. గతేడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య కోవిడ్ బారిన పడ్డ 12,863 మందికి చెందిన వివరాలను వారు సేకరించారు. వారిని మూడు వర్గాలుగా విభజించారు. 66-74 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఒక గ్రూపుగా, 75-79, 80-86 ఇలా మొత్తం 3 గ్రూపులుగా విభజించారు. ఈ క్రమంలో వారి వివరాలను విశ్లేషించారు. చివరకు వెల్లడైందేమిటంటే..
దెమెంటియా, అల్జీమర్స్ వ్యాధులతో బాధపడేవారికి కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని, వారు కోవిడ్ బారిన పడతే ఇన్ఫెక్షన్ కారణంగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. మరీ ముఖ్యంగా 80 ఏళ్ల వయస్సు అంతకు పైబడిన వారికి రిస్క్ ఎక్కువని తెలిపారు. కనుక ఆ రెండు వ్యాధులతో బాధపడేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు. ఈ మేరకు సైంటిస్టులు తమ అధ్యయనానికి చెందిన వివరాలను ది జర్నల్ ఆఫ్ ది అల్జీమర్స్ అసోసియేషన్లోనూ ప్రచురించారు.