ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌కు గాను భారత్‌లో ఫేజ్ 2, 3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను పూణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు కూడా పొందింది. దేశంలో మొత్తం 17 చోట్ల ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఒక కేంద్రంలో మాత్రం పలు కారణాల వల్ల ట్రయల్స్ కు మరింత ఆలస్యం అవుతోంది.
చండీగఢ్‌లో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో సెప్టెంబర్ 1 నుంచే ట్రయల్స్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ ట్రయల్స్ లో పాల్గొననున్న మొదటి 100 మంది వాలంటీర్ల సేఫ్టీకి సంబంధించి ఇంకా అనుమతులు రావల్సి ఉంది. అందువల్ల ట్రయల్స్ కు జాప్యం ఏర్పడుతోంది. ఈ కేంద్రంలో మొత్తం 253 వాలంటీర్లను ట్రయల్స్‌కు ఎంపిక చేశారు. అందుకు గాను మొత్తం 400 మంది ఆసక్తి చూపించారు. వారిలో 253 మందిని ఇప్పటికే ఎంపిక చేశారు. కానీ వాలంటీర్ల సేఫ్టీకి సంబంధించి ఇంకా పలు అనుమతులు రావల్సి ఉన్నందున ట్రయల్స్ ఆలస్యంగా జరగనున్నాయి. దీంతో కోవిషీల్డ్ ట్రయల్స్ ఆలస్యం కానున్నాయి.
కాగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌తోపాటు భారత్ బయోటెక్, జైడస్ కాడిలాలు కూడా తమ తమ వ్యాక్సిన్లకు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. అవి రెండో దశలో ఉన్నాయి. త్వరలోనే మూడో దశలో అవి ట్రయల్స్ చేపట్టనున్నాయి.