రాహుల్‌ కేరళ పర్యటనపై సీపీఎం విమర్శలు

-

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాత్రలో రాహుల్ ధరిస్తున్న దుస్తుల నుంచి ఆయన కలుస్తున్న వ్యక్తుల వరకు అన్నింటిపైనా విపక్ష, అధికార పక్షాలు ఓ కన్నేసి ఉంచాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’పై సీపీఎం విమర్శలు ఎక్కు పెట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో కేవలం 2 రోజులు మాత్రమే యాత్ర చేపట్టి.. కేరళలాంటి చిన్న రాష్ట్రంలో 18 రోజులు పాదయాత్రకు ప్రణాళిక సిద్ధం చేయడాన్ని తప్పుబట్టింది.

‘ఇది భారత్‌ జోడో యాత్ర కాదు.. సీటు జోడో యాత్ర’ అని సీపీఎం విమర్శించింది. దీనికి సంబంధించి ఆ పార్టీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఓ క్యారికేచర్‌ను ఉంచి.. భాజపా-ఆరెస్సెస్‌పై పోరుకు అనుసరిస్తున్న వినూత్న విధానం అంటూ వ్యంగ్య బాణాలు సంధించింది.

సీపీఎం విమర్శలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. యాత్రకు సంబంధించిన ప్రణాళికపై సరైన అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ నేతల జైరాం రమేశ్‌ మండిపడ్డారు. విమర్శలు చేసే ముందు దానిపై వర్క్‌ చేయాలని సూచించారు. దక్షిణ భారతంలో బీజేపీకి ఏ టీమ్‌గా వ్యవరిస్తున్న పార్టీ సిల్లీ విమర్శలు చేస్తోందంటూ తప్పుబట్టారు.

కేరళలోని వయనాడ్‌ నుంచి రాహుల్‌ ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన తన సీటును కాపాడుకునేందుకు రాష్ట్రంలో ఎక్కువ రోజులు యాత్ర చేస్తున్నారంటూ సీపీఎం విమర్శించగా.. కాంగ్రెస్‌ విమర్శల్ని తిప్పికొట్టింది. కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌, సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ మధ్యే ప్రధాన పోరు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news