దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ ఎత్తున అగ్రిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కేరళలోని కాసర్ గోడ్ లో గల ఓ ఆలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాణసంచా పేలి జరిగిన అగ్నిప్రమాదంలో 150 మందికి గాయాలవ్వగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాసర్ గోడ్ నీలేశ్వరం అంజుట్టంబలం వీరార్ కావు ఆలయంలో సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా అగ్రిప్రమాదం సంభవించింది.
థేయంకట్ట మహోత్సవాన్ని చూసేందుకు ఆలయానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకల్లో బాణసంచా కాల్చగా పక్కనే ఉన్న గదిలో నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో అక్కడున్న క్రాకర్స్ మొత్తం కాలిపోయాయి. ఫలితంగా అక్కడ తొక్కిసలాట జరగడంతో 150 మంది గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నీలేశ్వరం, కనహంగద్‌లోని ఆస్పత్రులకు తరలించారు. సీరియస్‌గా ఉన్న వారిని కన్నూర్‌లోని పరియారం మెడికల్ కాలేజీకి తరలించగా.. మళ్లీ అక్కడి నుంచి మంగళూరులోని హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు.