మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమేనని తేలడంతో తాము నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. సదరు భవన యజమాని లింగమనేని రమేష్ పేరిట అధికారులు నోటీసులు జారీ చేశారు.
కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని తేలడంతో తాజాగా అధికారులు దాన్ని నేలమట్టం చేసిన విషయం విదితమే. అయితే అదే కరకట్టపై ఉన్న 50 వరకు అక్రమ నిర్మాణాలపై చర్యలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ నిర్మాణాల విషయమై ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కరకట్టపై నిర్మించిన భవనాలపై చర్యలు తీసుకునేదిశగా అధికారులు కూడా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే కరకట్టపై ఉన్న నిర్మాణాలకు సీఆర్డీఏ తాజాగా నోటీసులు జారీ చేసింది. అందులో భాగంగానే చంద్రబాబు ఉంటున్న నివాసానికి కూడా అధికారులు నోటీసులు జారీ చేయగా.. ఇవాళ ఉదయమే సదరు నోటీసులను ఆ భవన గేటుకు అతికించారు.
మాజీ సీఎం చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమేనని తేలడంతో తాము నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు. సదరు భవన యజమాని లింగమనేని రమేష్ పేరిట అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితమే కృష్ణా నది కరకట్టపై ఆ భవంతిని నిర్మించగా.. 2015లో సీఎంగా ఉన్న చంద్రబాబు ఆ భవంతిని లీజుకు తీసుకుని అందులో నివాసం ఉండడం మొదలు పెట్టారు. ఆ తరువాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఈ నిర్మాణం అక్రమ కట్టడమని, దానిపై చర్యలు తీసుకోవాలని గతంలో కోర్టులో కేసు వేశారు. ఇక ఆ భవంతి అక్రమ కట్టడమే కాక, అందులో ఏర్పాటు చేసుకున్న వసతులకు కూడా అనుమతులు తీసుకోలేదని సీఆర్‌డీఏ తన నోటీసుల్లోనూ పేర్కొంది.
అలా నిబంధనలకు విరుద్ధంగా కట్టబడిన లింగమనేని రమేష్ భవంతికి సీఆర్‌డీఏ ఇవాళ నోటీసులు జారీ చేయడమే కాక, వారంలో రోజుల్లో నోటీసులకు స్పందించాలని, లేదంటే భవంతిని తొలగిస్తామని హెచ్చరించింది. అయితే భవన యజమాని ఇచ్చే వివరణ సంతృప్తిగా లేకున్నా ఇంటిని తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఇక కృష్ణానది కరకట్టపై ఉన్న మరో 50 నిర్మాణాలకూ అధికారులు నోటీసులు జారీ చేసే యత్నం చేస్తున్నారు. నోటీసులు అందుకున్న భవన యజమానులు వారం రోజుల్లో స్పందించాల్సి ఉంటుందని సీఆర్‌డీఏ తెలిపింది.