క్రెడిట్ కార్డు అప్​గ్రేడ్ చేస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!

-

ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు లేని వారు ఉండరు. దాదాపు అందరి దగ్గర క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ కార్డులపైనే ఆఫర్లు ఎక్కువ. ముఖ్యంగా ఆన్​లైన్ షాపింగ్, ఏదైనా వస్తువుకు ఈఎంఐ పెట్టినప్పుడు క్రిడిట్ కార్డ్స్ బాగా యూజ్ అవుతాయి. అయితే మొదట క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు సంబంధిత బ్యాంకులు పెద్దగా ఆఫర్లు లేని కార్డులు మాత్రమే ఇస్తాయి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ, క్రెడిట్ స్కోరును బట్టి స్పెషల్ ఆఫర్స్ అందించే కార్డుకు అప్​గ్రేడ్ అవ్వమని సూచిస్తాయి. అయితే వాళ్లు ఆఫర్స్ ఇస్తున్నారుగా అని మాయలో పడి కార్డు అప్​గ్రేడ్ చేసుకుంటే మొదటికే మోసం వస్తుందంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకే క్రెడిట్ కార్డు అప్​గ్రేడ్ చేసుకునే ముందు ఈ చిట్కాలు పాటించమని చెబుతున్నారు. అవేంటంటే..?

మనం చేసే ఖర్చుల కేటగిరీలను బట్టి కార్డును అప్​గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తే ట్రావెల్ కార్డు యూజ్ అవుతుంది. వీటి వల్ల విమాన టికెట్లపై డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఇంధన కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్​పై రాయితీ ఉంటుంది. అందుకే మీ ఖర్చులు ఎక్కువగా ఏ కేటగిరీల్లో ఉంటాయో గమనించి దానికి తగ్గట్టు కార్డును అప్​గ్రేడ్ చేసుకోండి.
మీ కార్డు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వివిధ సంస్థలు ఇచ్చే ఆఫర్లపై ఓ లుక్కేయండి. వాటి ద్వారా ఏం యూజ్ ఉందో అంచనా వేయండి. మీరు షాపింగ్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్, డిస్కౌంట్స్ ఏ రూపంలో ఎంత మేర ప్రయోజనం ఉంటుందో చెక్ చేస్కోండి. కొన్ని కార్డులకు ప్రత్యేకమైన బ్రాండ్లపైన మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది. అందుకే చూసి సెలెక్ట్ చేసుకోండి. మీ ఖర్చుకు.. వచ్చే రాయితీకి పొంతన ఉందో లేదో సరిచూసుకోవాలి. రూ.లక్ష ఖర్చుపై రూ.100 ప్రయోజనం లభిస్తే ఉపయోగం ఉండదు.

మంచి ప్రయోజనాలు ఉన్నాయంటే.. వార్షిక రుసుము కూడా అధికంగానే ఉండే అవకాశం ఉంది. అందుకే మీరు చెల్లించే రుసుముకి.. వచ్చే ప్రయోజనాలకి పొంతన ఉందో.. లేదో.. చూసుకోవాలి. మరికొన్ని సంస్థలు నిర్దిష్ట వ్యయ పరిమితిని నిర్దేశిస్తాయి. అది దాటితే వార్షిక రుసుముని రద్దు చేస్తాయి. అందుకే మీ ఖర్చు ఆ స్థాయిలో ఉందో.. లేదో.. చూసుకోండి. అందుకు తగ్గట్టుగానే రుసుము ఉండాలి. వ్యయ పరిమితి చేరుకోలేని స్థాయిలో ఉంటే.. అధిక రుసుము చెల్లించి ఉపయోగం ఉండదు.

కార్డుని అప్‌గ్రేడ్‌ చేసుకున్నప్పుడు సహజంగానే క్రెడిట్‌ లిమిట్‌ కూడా పెరుగుతుంది. అంటే క్రెడిట్‌ కార్డుపై మీకు లభించే మొత్తాన్ని జారీ సంస్థలు పెంచుతాయి. అత్యవసర సమయాల్లో క్రెడిట్‌ కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే ఎక్కువ క్రెడిట్‌ లిమిట్‌ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో.. ఫలితంగా క్రెడిట్‌ స్కోర్‌ కూడా మెరుగుపడుతుంది. అయితే, క్రెడిట్‌ లిమిట్‌ అనేది మీ ఆదాయం, మీరు అప్‌గ్రేడ్‌ చేసుకోబోయే కార్డుపై కూడా ఆధారపడి ఉంటుంది.

కార్డుని అప్​గ్రేడ్ చేసే ముందు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కార్డుని మీరు ఎంత మేర వాడుతున్నారు. ఆ కార్డు వల్ల ప్రయోజనం పొందారా లేదా అనేది చెక్ చేస్కోండి. కొత్తకార్డు వల్ల మీకు ప్రయోజనం ఉందనిపిస్తేనే అప్​గ్రేడ్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న కార్డు వల్ల మీరు అత్యధికంగా పొందుతున్న లబ్ధిని కొత్త కార్డు ద్వారా కోల్పోకుండా చూసుకోవాలి. అలాగే ఈ కార్డులో ఉన్న రివార్డు పాయింట్లు కొత్త కార్డుకి బదిలీ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే.. వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news