డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ కాలనీకి చెందిన 5 మంది బాలురు జూలై 19వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పబ్‌జి మొబైల్ గేమ్ రోజు రోజుకీ పిల్లలు, యువతను వ్యసనపరులుగా మారుస్తోంది. దాని మోజులో పడి అన్ని పనులను వదిలేసి కొందరు రోజుల తరబడి ఆ గేమ్ ఆడడంలోనే లీనమవుతున్నారు. పబ్‌జి మొబైల్ గేమ్ వల్ల పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలను కూడా మనం గతంలో చూశాం. అయినప్పటికీ పబ్‌జి దుష్పరిణామాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ 5 మంది బాలురు తమ తమ ఇండ్లలో పబ్‌జి మొబైల్ గేమ్ ఆడవద్దన్నారని చెప్పి ఏకంగా ఇండ్ల నుంచే పారిపోయారు. డెహ్రాడూన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
డెహ్రాడూన్‌లోని రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓ కాలనీకి చెందిన 5 మంది బాలురు జూలై 19వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అందరూ చెప్పింది ఒకే కారణం.. తమ పిల్లలను తాము పబ్‌జి మొబైల్ గేమ్ ఆడవద్దన్నామని, దాంతో వారు అప్పటి నుంచి కనిపించకుండా పోయారని అన్నారు. దీంతో పోలీసులు వారిని ట్రేస్ చేశారు. వారి సోషల్ మీడియా అకౌంట్లు, వారి ఫోన్ నంబర్లను ట్యాప్ చేసి వారు ఎక్కడ ఉన్నారో కనుగొన్నారు. 5 రోజుల తరువాత జూలై 24వ తేదీన వారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చి వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
కాగా ఆ 5 మంది బాలురలో ఒకరు 10వ తరగతి చదువుతుండగా, మిగిలిన నలుగురు 7వ తరగతి చదువుతున్నారు. వారి వయస్సు 11 నుంచి 15 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వారందరూ స్నేహితులని గత కొద్ది రోజులుగా వారు పబ్‌జి మొబైల్ గేమ్‌కు తీవ్రంగా బానిసలయ్యారని అందుకే వారిని ఆ గేమ్ ఆడొద్దని చెప్పగానే.. వారు ఇంటి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. కాగా ఒకే కాలనీకి చెందిన 5 మంది బాలురు ఒకేసారి మిస్సయ్యే సరికి స్థానికంగా కలకలం రేగింది. అయితే ఎట్టకేలకు వారు సురక్షితంగా ఇంటికి చేరడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏది ఏమైనా… పబ్‌జి మొబైల్ గేమ్ మాత్రం చిన్నారులు, యువతను బాగా బానిసలను చేస్తుందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు..!